8, మే 2014, గురువారం

మౌనం

ఆ వీధి చివర ఎవరో పాడుతున్నారు
శృతి లయలతో సంభంధం లేకుండా 
ఈ చివర నేను నడుస్తున్నాను 
గమ్యం సమయం తెలియకుండా..... 

నీవు నడిచిన అడుగుల్లో రోజు నడుస్తున్నాను,
నీ జాడ లేదు 
నిన్ను చేరడం లేదు 
నీ అడుగుజాడలు చెదరడం లేదు 
అలసిపొతున్నాను నేస్తం 
ఆగిపోవా!

మౌనంలో ఎన్నో మాటలు ఉంటాయంటారు
కాని నా మాటల లోతుల్లో కూడా మౌనాలేనే!

ఈ జనసంద్రం లో నేనెవరినో
ఈ అడుగులు ఎటువైపో 
వినిపిస్తుందా నా ఒంటరి ఆలాపన  

3, మార్చి 2014, సోమవారం

క్లౌడీన్ ముర్వేలీన్



గత ఆరు రోజులుగా రోజు రాత్రి తన కోసం ఏడుస్తున్నాను. నా కన్నీళ్లు తన బాధలని పోగొడుతుంది అనుకుంటే రోజు ఏడుస్తాను. కాని నేను తన కోసం ఇంత బాధపడుతున్నానని తనకు తెలిదు. తనకి నేనెవరో కూడా తెలిదు. మా ఇద్దరి మధ్య కొన్ని ఖండాల దూరం. తన పేరు క్లౌడీన్ ముర్వేలీన్

ఎక్కడ విన్నట్టు కూడా లేదు కదా ఈ పేరు. ఆఫ్రికా ఖండం లో రువాండా అనే దేశం లో ఒక సాధారణ మహిళ. మహిళ కాబట్టే ఇక్కడ చర్చిస్తున్నాను. మహిళ కాబట్టే తన కోసం ఏడుస్తున్నాను. మహిళ కాబట్టే ఈ వేదన. 
రువాండా దేశం లో వేరు వేరు తెగల మధ్య యుద్ధం సర్వసాధారణం. ఇలాంటి రెండు తెగల మధ్యలో జరిగిన ఘర్షనలో క్లౌడిన్ ని వేరే తెగ వాళ్ళు అపహరించుకొని వెళ్లారు. అప్పుడు తను 13 సంవత్సరాల చిన్న పిల్ల.
తనను అపహరించుకొని ఒక గది లో వేసారు. అలాంటి గదులు ఆ భవనం లో చాలానే ఉన్నాయి. క్లౌడిన్ లాంటి అమ్మాయిలు కూడా చాల మందే ఉన్నారు ఆ గదుల్లో . అ భవనం పేరు రేప్ హౌస్ (rape house). అక్కడ పోరాడుతున్న సైనికుల కోరికలు తీర్చుకోవడానికి క్లౌడిన్ లాంటి అమ్మాయిలను బంధించారు. భవనం బయట ఓపికగా భార్లు తీరారు సైనికులు, లోపల ఆ చిన్న పిల్లలకి నరకం ఏంటో చూపించడానికి ఎదురుచూస్తూ....
అలా క్లౌడిన్ ని ఎంత మంది బలవంతం చేసారో తనకి తెలిదు ఎందుకంటే లెక్కబెట్టలేనంత మంది చేసారు కాబట్టి, ఎంత వరకు అంటే తనకి కాళ్ళ మధ్య లో స్పర్శ లేనంతగా. తన వాసన తనే భరించలేనంతగా చేసారు. నడవడం కూడా నరకం అనిపించేలా చేసారు. మలమూత్రాలు ఎప్పుడు విసర్జిస్తుందో తెలియనంతగ. తను 13 సంవత్సరాల చిన్నపిల్ల పాపం (ఇది రాస్తూ తనకోసం మరో కన్నీటి చుక్క)
ఇది కేవలం క్లౌడిన్ పడే బాధలు కాదు ఆ భవనం లో ని అందరు పిల్లలు పరిస్థితి, అలాంటి భవనాలు ఆ దేశం లో ఎన్నో, అలాంటి దేశాలు ఆఫ్రికా ఖండం లో ఎన్నో. ఇది కేవలం ఆఫ్రికా కి మాత్రమె పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచం మీద 2 కోట్ల మంది అమ్మాయిలని వ్యభిచారం కోసం ఇలా హింసిస్తున్నారు. ఈ సంఖ్యా కేవలం 16 సంవత్సరాల లోపు పిల్లలది మాత్రమే.
క్లౌడిన్ కోసం నేనేం చేయాలో నాకు తెలిదు.  తన కోసం బాధ పడుతున్నాను, కాని నా భాధ తన భాధాలని దూరం చేయ్యనప్పుడు అది వృధానే. మన పరిధి లో మనం  ఏమి చేయలేకపోవచ్చు, మన ఉద్యోగ రిత్య కుటుంభ రిత్య అది సాధ్యం కాకపోవచ్చు, కాని అన్ని వదులుకొని ఇలాంటి వాళ్ళకోసం సహాయం చేసే దేవతలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఆర్ధిక సహాయం అందించడానికి ప్రయత్నిదాం.
ఈ సంస్థ గురించి తెలుసుకున్నాను. http://www.womenforwomen.org/
ఇలా భురద లో దిగి పని చేసేవాళ్ళ కోసం వీలైత సహాయం చేదాం, క్లౌడిన్ లాంటి ఇంకో అమ్మాయి కన్నీరు తుడవడం కోసం.

ఈ విషయాన్ని మీ ముందుకి తీసుకొని రావాలనే చిన్న ప్రయత్నం 















16, మార్చి 2013, శనివారం

హోగి వాగి



ఇదేం టైటిల్ అని ఆశ్చర్యపోతున్నారా.. Hungary బాష లో ఎలా ఉన్నావు అని అర్ధం..... 

పోయిన నెల Hungary  దేశ రాజధాని బుడాపెస్ట్ కి నేను నా స్నేహితులం కలిసి వెళ్ళాం...Danube నది తీరం మీద నిర్మించబడినది ఈ నగరం...ఇన్ని రోజులు బుడాపెస్ట్ ఒకే నగరం అని అనుకున్నాను ఇక్కడికి వచ్చాకే తెలిసింది బూడ మరుయు పేస్తో రెండు నగరాలని కలిపి బుడాపెస్ట్ అంటారని... 

Danube నది తూర్పు దిక్కున బూడ నగరం, పడమర దిక్కున పేస్తో నగరం ఉన్నాయి...నన్ను బాగా ఆకట్టుకుంది మాత్రం బూడ నగరం, ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగి కొండలతో, హంగరి రాజుల కోటలతో చాల చాల అందంగా ఉంది.
బుడాపెస్ట్ లో చూడ దగ్గ ప్రదేశాలు 

1) Castle Hill 



నాకు బాగా నచ్చిన ప్రదేశం బూడ నగరం లో ఉన్న ఈ కొండ...ఇక్కడికి చేరుకోవడానికి మంచి బస్సు సౌకర్యం ఉంది...నాకు ఎతైన ప్రదేశాలంటే చాల ఇష్టం..అలా పై నుండి ప్రపంచాన్ని చూస్తుంటే ప్రతిది అందంగానే అనిపిస్తుంది. ఈ ప్రదేశం రాత్రి చూస్తే ఇంకా ఇంకా బాగుంటుంది... రెండు ప్రయత్నించవచ్చు 

ఇంత ఎత్తు మీద హంగరి రాజు గారు మంచి కోట కట్టుకున్నారు...కోట లో కొంత భాగం శిధిలావస్థ లో ఉన్నా చాల భాగం ఇంకా చెక్కు చెదరకుండా గట్టిగా ఉంది...ఇక్కడ musuem, ఈ కొండ ఎక్కడానికి వింతగా బుల్లిగా ఉన్న రైలు తప్పకుండ వెళ్లి తీరాల్సిందే... 

ఈ కొండ మీద బస్సు దిగగానే కనిపించే restaurant లో కి  దూరి పోయ్యాము  నేను మా స్నేహితులం కలిసి...అక్కడ chocolate కేకు ఆర్డర్ చేసాను... నా సామి రంగ... ఏమి ఆ కేకు...ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది.. అద్బుతం..మహా అద్బుతం. కచితంగా ప్రయత్నించండి.... 

2) Orszaghaz (పార్లమెంట్ )


ఆ పేరు చదివి పలకడం కంటే నోరు మూసుకోవడం మంచిది అని నిర్నయిన్చేసుకున్నాము అందరం...ఈ దేశం లో పేర్లు పలకడానికి అస్సలు ప్రయత్నించకూడదు, రాసినదానికి పలికినదానికి పొంతే ఉండదు ఈ బాషలో..అందుకే చదువు రాని వాళ్ళలాగా కాగితం మీద రాసుకొని అయ్యా ఈ ప్రదేశం వెళ్ళాలి, కొంచం ఏ బస్సు ఎక్కాలో చెప్తారా అంటూ పని కానిచాము...



హన్గేరియన్ పార్లమెంట్ ని danube నది ఒద్దు మీద  పేస్తో నగరం లో కట్టారు, బూడ వైపు నుండి చూస్తే చాల అందంగా నది మీద తేలుతుందా అనిపించేటట్టు బలే ఉంటుంది. నేను ఇంత వరకు చూసిన కట్టడాల్లో ఇది బెస్ట్. బూడ నుండి చూస్తే చచినట్టు కనిపిస్తుంది కాబట్టి, మిస్ అయ్యే సమస్యే లేదు...రాత్రి కూడా చాల లైట్ లు వేసి వెలిగిస్తారు కాబట్టి ఇంకా అద్బుతంగా ఉంటుంది. ఈ పైన ఉన్న బొమ్మ రాత్రి తీసింది

3) హీరోస్ స్క్వేర్


హంగరి దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజులు, సేనాధిపతులు, సైనికుల స్మారక చిహ్నం ఈ హీరోస్ స్క్వేర్. నగరం నడిబొడ్డున కట్టినా విశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రదేశం. పక్కనుండి కోటానుకోట్ల కార్లు, బస్సులు వెళ్తున్న కూడా ఈ ప్రదేశం లో నిలబడితే ఒక లాంటి నిశబ్ధం ఆవహిస్తుంది. ప్రాణాలు పనంగా పెట్టి ఈ దేశం కోసం యుద్ధం చేసిన వాళ్ళ విగ్రహాలను సూటిగా కళ్ళలోకి చూస్తుంటే భయం వేస్తుంది. గంభీరంగా రొమ్ము విరుచుకొని నిలబడ్డ సైనికులను, రాజులని చూస్తుంటే ఇలా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం లో కూడా ఆనందం ఉంటుందని అక్కడ నిలుచుంటే బోద పడింది. తప్పకుండ చూడవలసిన స్క్వేర్. 

4) షూస్ ఆన్ ది డానుబ్ ( Shoes on the Danube )



"ఎ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం, నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం"  శ్రీ శ్రీ గారు అన్న మాటలు గుర్తొచ్చాయి ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు. 

ఐరోపా ఖండానికి నల్ల మచ్చ యూదులని దారుణంగా హత్య చేయడం. హంగరీ దేశం కూడా దీనికి అతీతం కాదు. రెండో ప్రపంచ యుద్ధం లో యూదులను Danube నది ఒడ్డు న నిలబెట్టి కాల్చి నీళ్ళల్లోకి తోసి చంపేశారు. అలా చంపే ముందు వాళ్ళ చెప్పులను విడిచివేయ్యమని చెప్పి కాల్చారంట అందుకే ఈ దారుణానికి చింతిస్తూ వారి స్మారకంగా చెప్పులు పెట్టారు నది ఒడ్డున. 

ఏమనుకోవాలి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకోవడం తప్ప...

యూదులకు పట్టిన స్థితి మళ్ళి ప్రపంచ చరిత్ర లో ఎవ్వరికి  పట్టకూడదు దెవుడా.....

మాకు టైం సరిపోక వెళ్ళలేదు కాని బుడాపెస్ట్ లో తప్పకుండ చేయవలసినది, ఔషధ విలువలు కలిగిన ఈత కొలనులలో ఈదడం. ఇక్కడ ఈత కొలనులు సహజమైనవి, మట్టి లో ఉండే అనేక మినరల్స్ నీటి లో కలిసి చర్మ వ్యాధులని నివారిస్తుందని ప్రసిద్ధి. టైం ఉంటె తప్పకుండ ప్రయత్నించండి. 

అన్ని చెప్పుకొని తిండి గురించి మరిచిపోయ్యాను...స్వచమైన హన్గేరియన్ రుచులు ప్రయత్నించాలంటే మంచి హోటల్ కి వెళ్ళడం ముఖ్యం. మేము వెతికి వెతికి ఒరిజినల్ హన్గేరియన్ తిండి దొరికే Udvarhaz అనే restaurant కి వెళ్ళాము. ఇది కొండ పైన ఎక్కడో అడవి లో కట్టారు. గంట సేపు ప్రయత్నించి మొతానికి చేరుకున్నాం. చేరుకోవడం తోనే హన్గేరియన్ అమృతం అని చెప్పి 30% alcohol ఉన్న బుడ్డి సీస చేతిలో పెట్టారు. బాబు మీ అమృతం తాగే అర్హత నాకు లేదు అని సవినయంగా ఒప్పుకొని పళ్ళ రసం పుచుక్కున్నాను. తర్వాత traditional హన్గేరియన్ నృత్య ప్రదర్శన సంగీతం బలే బాగున్నాయి. కాళ్ళతోనే శబ్దం చేస్తూ మంచి సంగీతం పుట్టించారు (tap dancing). హంగరీ గులాష్ సూప్ ప్రపంచ  ప్రక్యాతి పొందింది. అది మన పళ్ళెం లో మొదటగా పడింది. మల్లి చిక్కు ఎదురైంది. అందులో పంది మాంసం ఉంది మరి. సూప్ తాగి మిగితాది వేదిలేసాను. నిజం చెప్పాలంటే, నేను చేసే మిర్యాల చారు లాంటి మిర్యాల చారు లాగ ఉంది ఈ సూప్. తర్వాత పుట్టగోడుగులతో, టమటలతొ, చికెన్ తో చేసిన వంటకం అధుర్స్...రెండు సార్లు తిని హంగరి దాత సుఖీభవ అని ధీవించెసాను. 

హంగరీ దేశ చరిత్ర, బాష, తిండి, సంస్కృతికి అద్దం పడుతుంది బుడాపెస్ట్ నగరం. చూడవలసిన చక్కటి ప్రదేశం. వీలైతే మీరు చూడండి. 

కుర్-సుర్-నుం అంటే హన్గేరియన్ బాష లో థాంక్స్ అన్నమాట.

3, ఫిబ్రవరి 2013, ఆదివారం

వాన


ఆకాశం బూడిద రంగు లోకి మారిపోయింది. పగటి వెలుతురికి, రాత్రి చీకటికి మధ్యగా ఉండే వర్ణం భలే బాగుంది. చల్లని గాలికి చెట్లు, ఆకులు నాట్యాలు చేస్తున్నాయి. మిద్దే మీద ఆరేసిన వడియాలు, బట్టలని హాదివిడిగా తీయడానికి పరుగులు పెట్టాము, అంతలోపే మెల్లగా చినుకులు మొదలయ్యాయి. చిలుకులన్ని కలిసి వానగా మారిపోతుంది. ఇంటి ముందు కూర్చొని సజ్జే మీద నుండి పడుతున్న చినుకులని కొన్ని చేతిలోకి పట్టుకోవాలనే తాపత్రయ పడుతున్నాం. అప్పుడే అమ్మ వేడి వేడి పకోడీ చేసి తెచ్చింది. చిక్కని కాఫీ తాగుతూ పకోడిని తింటూ, అడపా దడపా గొడుగు పట్టుకొని అలా వర్షం లోకి వెళ్లి వస్తున్నాం. వాన లో స్నానం చేస్తున్న చెట్ల సంతోషాన్ని చూస్తున్నాం. టైటానిక్ పడవలను పోలే మా కాగితం పడవలు ఇంటి ముందు వెలిసిన చిన్న మడుగుల్లో ఏదో తీరానికి చేరాలని ప్రయత్నిస్తూ, పడుతున్న చినుకుల తాకిడికి చితికిల పడిపొయ్యి, నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి. వాన ఎంత పడ్డదో కొలవడానికి మా నాన్న తెచిన్న rain guage ని పదే పదే వెళ్లి చూస్తున్నాం. ఒక్క సెంటీమీటర్, రెండు సెంటీమీటర్...హమ్మయ్య ఇంత వాన చాలు.. ఇంక చేల దాహం తీరినట్టే అని మా అమ్మ, నాన్న సంతోచిస్తున్నారు. వర్షం కొంచం తగ్గుముఖం పడుతున్న సూచనలు మొదలవ్వడం తో ఇంక ప్లాస్టిక్ సంచులతో అందరం సిద్ధంగా ఉన్నాం. ఇంట్లో నుండి అమ్మ అరుపు అనుకుంటా " వాన లో ఆడకండి, పడిశం పడుతుంది" అని, అవి మా చెవుల్లోకి ఎక్కితే కదా...ఇంక మొదలవుతాయి మా వాన ఆటలు, కేరింతలు. ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకోవడం. చెట్టు మీద కాయ ఉంది అని చూపించి చెట్టు ని విదిలించడం, ఎవరి పడవ ఎంత దూరం వెళ్తుంది అని పందెం కట్టుకుంటూ ఉండగా వాన వేలిసిపోతుంది. ఆకాశానికి  కూడా మా ఆనందం చూడడం ఇష్టమేమో మబ్బులని పక్కకు నెట్టేసి, మా వైపు నిండు గా, నీలపు రంగు లో కి మారిపోయ్యి చూస్తూ నవ్వుతుంది. 

వాన వేలిసిన వెంటనే మా ఆటలు ఆగిపోవు, అలా రోడ్ పక్కన వాగులో ఎంత వాన పడిందో చూడడానికి అందరం బయలుదేరుతాం. ప్రకృతి అంతా స్నానం చేసి అలంకరించుకున్నట్టు చాల అందంగా ఉంది. రోడ్ కూడా నల్లగా మేరుస్తుంది. ఆ వాగు లోకి దిగి మల్లి ఇంకోసారి ఆడుకున్నాం.  బురద లో నడుచుకుంటూ, చేలలోకి వెళ్లి మా చిన్ని చేతుల్లో పట్టినంత బంక మట్టి తెచుక్కొని, ఒక్కొక్కరం శిల్పాలు చెక్కే శిల్పి లెవెల్ లో pose కొడుతూ ఆ బంక మట్టితో ఏనుగు, గుర్రం, గాడిద, ఆవు ( అన్ని ఒకేలాగా ఉంటాయనుకో కాని వేరే వేరే పేర్లు పెట్టేవాళ్ళం మా కళ ని మేమే ఆధారించుకోవాలి కదా మరి !) చేసేవాళ్ళం. అదే బంక మట్టి తో చిన్ని చిన్ని కుండలు, వాటికి మూతలు, అందులో పెట్టడానికి మురుకులు, లడ్లు కూడా చేసేవాళ్ళం. కూర గిన్నె, అన్నం గిన్నె ఇలా ఏవో రకాలు చేసి ఒక వంట ఇంటికి కావాల్సిన సామగ్రి చేసే వాళ్ళం. మరుసటి రోజు కొంచం ఎండబెడితే ఇంక పావులాట ఆడుకోవచ్చు చక్కగా...

అంతా అయిపోయాక వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి, చక్కగ బుట్ట బొమ్మ లాగ తయ్యారయ్యి అన్నం తిని హాయిగా బజ్జుకొనే వాళ్ళం. ఇలా వాన వచ్చిన రోజు మాకు పండగే. అంత తడిసినా కూడా " పిల్లకి పీట చేక్కకి చలి పెట్టదు"  అని మా అమ్మ చెప్పే సామెత ని నిజం చేస్తూ మరుసటి రోజు పుష్కలంగా ఆరోగ్యంగా మల్లి ఆటల్లోకి జారుకొనే వాళ్ళం. పావులని ఎండబెట్టాలి, అందులో వంటలు చెయ్యాలి కదా మరి...

సిటీ లో ఈ ఆనందాలు దొరకవు, ఈ నాగరికపు జీవితం లో బందిలమైపోయ్యి, వాన ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్లిందో కూడా గమనించడం లేదు. ఆనందించడం పక్కన పెట్టి, రోడ్లంత నిండి పొయ్యి, ఎందుకు పడింది ఈ వాన అని తిట్టుకొనే ధుస్థితికి దిగజారం.....

వాన సినిమా లో త్రిష వాన తో ' నువ్వస్తానంటే నెనొదంటనా ' అని పాడుతుంది కాని మనం నువ్వు (వర్షం) వస్తానన్న పిలుపు నాకు వినిపించడం లేదు, వద్దు అని చెప్పే అంత సమయం కూడా నాకు లేదు అని పాడుకోవాలి  నిజమే మరి చుట్టంలా వస్తుంది, చూసే దిక్కు లేక వెళ్ళిపోతుంది మన వాన.

27, జనవరి 2013, ఆదివారం

కొన్ని బాల్యపు స్మృతులు -1


మా చిన్న పల్లెటూరు లో మొత్తం 20 ఇళ్ళు. అందరు మా చుట్టాలే, కాకపోయినా అలా కలిసి ఉండే వాళ్ళం. హాస్టల్ లో ఉండి చదువుకుంటూ సెలవుల్లో ఊరు వెళ్ళేవాళ్ళం. మా మామయ్య పిల్లలు, బాబయ్య పిల్లలు అందరం కలిసి ఒక 15 మంది దాక ఉండేవాళ్ళం. మేము అందరం కలిసి చేసిన అల్లరి, గోల, ఆటలు, పాటలు ఇవి మాత్రమే మేమందరం పోగేసుకున్న జ్ఞాపకాలు. మధురమైన జ్ఞాపకాలు. ఇలా జ్ఞాపకాల గులకరాల్లలో కొన్ని రాళ్ళు నీటిలోకి విసిరుతూ అలా...
జామకాయ చెట్టు - 
మా మమ్మయ్య వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద జామకాయ చెట్టు ఉండేది. అందరం పిల్లలం కలిసి ఆ చెట్టు మీదే ఉండేవాళ్ళం, ఒక్కొక్కరం ఒక్కో కొమ్మ మీద కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ, కధలు చెప్పుకుంటూ కాలం గడిపేవాళ్ళం. ఆకరికి అన్నం కూడా దాని మీదే తినేవాల్లం. ఆ చెట్టు కి చిన్న పిందే కాయడమే పాపం దాన్ని చట్టుకున కోసేసుకొని తినేవాళ్ళం. పాపం ఆకరికి దాని ఆకులు కూడా వదలకుండ అందులో ఉప్పు, చింతపండు పెట్టుకొని తినేవాళ్ళం. ఆ రుచి అమోఘం. దాని కొమ్మలు ఒక్కోకరం పంచుకొని పేర్లు కూడా చేక్కుకున్నాం. ఇలా పాపం దాని ఆకులు, దాని పండ్లు, దాని బెరడు ఇలా ఏది వదలకుండా బాధ పెట్టినా, ఒప్పిగ్గా మా బాల్యాన్ని బరించింది మా జామకాయ చెట్టు. ఇన్ని జ్ఞాపకాలు ఇచ్చిన మా చెట్టు మేము పెద్దవాళ్లం అయిపోయి ఎక్కడం మానేసినందుకు అలిగి ఒక గాలివానకు విరిగి పొయి చచ్చిపోయింది. 15 మందిని తన ఒడిలో చేర్చుకొని ఆడించిన మా చెట్టు ఇప్పుడు లేదు. ఆ చోటు ఇప్పుడు బోడిగా మాకు మా చెట్టు ని గుర్తుతేస్తుంది, అలాగే మా బాల్యపు తీయదనాన్ని కూడా.



రోడ్ల మీద ముళ్ళు పెట్టడం 

ఈ జ్ఞాపకం ఎన్ని సార్లు తలుచుకున్నా మొహం మీద చిరునవ్వు తెస్తుంది. మా వెర్రి ఎన్ని వింత తలలు వేసేదో చెప్తుంది. మా ఊరిని ఆనుకొని రోడ్ ఉండేది, దాని మీద RTC బస్సులు, జీపులు, వెళ్ళేవి. ఎవరి ఆలోచనో గుర్తులేదు కాని ఆ రోడ్ మీద వెళ్తున్న బస్సుల కింద ముళ్ళు పెట్టి వాటిని పంచర్ చెయ్యాలని అనుకున్నాం. పెద్ద పెద్ద సర్కస్ ముళ్ళు ఏరుకొని రోడ్ మీద చక్కగా పరిచి, పక్కనే ఉన్న మా గడ్డి వాము వెనక దాక్కొని బస్సు ముళ్ళమీద నుండి వెళ్ళడం చూసి గట్టిగ అరిచేవాళ్ళం. కాస్త దూరం వెళ్ళాక  ఆగిపోతుందేమో అని ఎదురు చూసేవాళ్ళం. మా పిచ్చి కాకపోతే బస్సు పయ్యలు మేము పెట్టిన చిన్న ముళ్ళకి పంచర్ అవుతాయా. అది అప్పట్లో తెలిలేదు మాకు. చివరకి ఇలా జీపులు, బస్సులకి ఏమి కావడం లేదు అని స్కూటర్ ల మీద పడ్డాం. దూరంగా ఏదో స్కూటర్ కనిపిస్తే ముళ్ళు పెట్టి ఎదావిధిగా దాక్కున్నాం. దగరికి వస్తున్న స్కూటర్ మీద  స్వయంగా మా నాన్నే. ఇంకేముంది బండి పంచర్ కాలేదు కాని మాకు పంచర్ పడింది. మా నాన్న పెద్దగా ఏమి అనలేదు, పైగా ఈ ముళ్ళ వల్ల బుస్సులకి ఏమి కాదు అని ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.

దాగిలి మూతలు (Hide and seek)

వీడి వీడి గుమ్మడి పండు వీడి పేరేంటి అని మా మామయ్య కళ్ళు మూసి ఆడించడం, ఆ చేతి స్పర్చ ఇంకా కల్ల మీద అలాగే ఉంది. కాస్త చీకటి పడుతుంటే మాకు దొరికే ఒకే ఒక్క ఆట దాగిలి మూటలు.. పిల్లలు పెద్దలు అందరు ఆడుకోనేవాళ్ళం, పిల్లలం దాకుంటే, పెద్దలు మమల్ని దాచడం, లేదా వెతికే వాడికి సహాయం చేయడం లాంటివి చేసేవాళ్ళు. ఈ ఆటలో తెలిసి వచ్చింది మా అపార తెలివితేటలు. దాకున్న వాడికి  వెతికేవాడు ఎప్పుడు లోకువే కొన్ని సార్లు అందరు ఒకే చోట దాక్కొని ఒకేసారి మీద పడేవాళ్ళం. ఆ చిన్న సమయం లో అందరి పేర్లు చెప్పి అవుట్ చేయడం కుదరదు కాబట్టి మల్లి వాడే దొంగ. ఇంకో అద్భుతమైన ఆలోచన చెప్పడం మరిచిపోయ్యను, బట్టలు మార్చుకోవడం, దొంగ ని తప్పుతోవ పట్టించడానికి ఆకరికి ఒకరి అంగీలు ఇంకొకరం మార్చుకోనేవాళ్ళం. అందరం చిన్న వాళ్ళం కాబట్టి, అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా మార్చుకొనే వాళ్ళం. ఇలా చొక్కాలు మార్చుకొని దొంగ ని ఇరకాటం లో పెట్టి 'కుండమోరిగిల్ల' 'కుండమోరిగిల్ల' అని అరిసేవాళ్ళం. ఆ పదానికి అర్ధం తెలిదు, అర్ధం ఉందో లేదో కూడా తెలుసుకోవాలనుకోవడం లేదు, ఎందుకంటే దాన్నే బాల్యం అంటారు కాబట్టి.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నో, మల్లి ఇంకో టపా త్వరలో....


Peace if possible, truth at all costs - Martin Luther king 

7, డిసెంబర్ 2012, శుక్రవారం

ఒక పూటలోనే రాలు పూలెన్నో



పసుపు పచ్చని రంగు లో కుంచె ని ముంచి, లోకమంతా పూసినట్టు ఉండే , మొన్ననే వచ్చి అంతలోనే వెళ్ళిపోయిన గ్రీష్మ ఋతువు. మన దేశం లో దీన్ని తీవ్రత అంతగా తెలియదు కాని ఐరోపా ఖండంలో, అమెరికా లో ఇది కొంత కాలము ఉండి ఎంతో అందంగా ఉంటుంది. నాకు ఈ ఆకు రాలు కాలం అంటే చాల ఇష్టం.కిటికీ పక్కన కూర్చొని మంచి కాఫీ కలుపుకొని తాగుతూ రాలిపోతున్న ఆకులని  చూస్తుంటే జీవిత సత్యాలు ఒక్కొక్కటే బోధ పడుతాయి. అవును రాలిపోతున్న ఆకులలాగే మన జీవితం కూడా చాల చిన్నది కదా మరి. వాటికి నాలుగు మాసాలు జీవితమైతే మనకు డెబ్బై సంవత్సారాలు జీవితం. చివరికి రెండు పండు పండి రాలిపోవాల్సిన్దే. 

రాలిపోయిన ప్రతి ఆకు, ప్రతి పువ్వు ని ఆ తల్లి  చెట్టు గుర్తు పెట్టుకుంటుందా ? పుట్టిన ప్రతి మనిషిని ఈ భూమాత గుర్తుపెట్టుకుటుందా ?? మన జీవితం కూడా అంతే, మన మునిమనవరాళ్ళు, మునిమన్నవళ్ళు గుర్తుపెట్టుకొనేదాకే , అంటే 150 సంవత్సారాల తర్వాత మనం ఒకరం పుట్టాము అన్న  సంగతి ఈ ప్రపంచం మర్చిపోతుంది.  

మొన్న ఏదో ఒక పుస్తకం లో చదివాను సూర్యుడు వయసు  4,500,000,000 సంవత్సరాలంట. ఈ సంఖ్యని మనిషి కాలమానానికి కుదిస్తే, సూర్యుడు 37వ సంవత్సారాల వయసు వాడైతే, మనిషి పుట్టింది ఎనిమిది గంటల క్రితమే. cosmic scale లో మనం రెప్ప వాల్చిన అంత చిన్న వయసు వాళ్ళం. హ్మ్మ్ ఎంత అల్పులం కదా. 

నిన్న ఉండి రేపు పొయ్యే జీవితం లో ఎన్ని అలజడులు, ఎన్ని ఆశలు, ఎన్ని ఆనందాలు. డబ్బే సర్వసం అయిన రోజుల్లో బ్రతుకుతున్నాం. డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోతున్నాము. చిన్న చిన్న ఆనందాలకు దూరమవుతున్నాము. జీవితాన్ని ఆస్వాదించడం మరిచిపోతున్నాము. జీవితం చాల చిన్నది అని గుర్తుంచుకొని ప్రతి రోజు ని ఆనందంగా గడపాలి. 


బాల్యం లో చదువుతోనే కాలం గడిచిపోతుంది, యవ్వనం లో సంపాదన తోనే సమయం గడిచిపోతుంది, తర్వాత పిల్లల పెంపకం, ఆ తర్వాత వ్రుధాప్యం లో చావు కోసం ఎదురుచూడడం, ఇంక జీవితం లో ఆనందం ఎక్కడుంది ? ఇది మనం సాధారణంగా చెప్పుకొనే సమాధానం, కాని రోజు మనం చేసే పనులలోనే ఆనందం వెతుకోవాలి, వీలైనప్పుడల్లా ప్రకృతిని ఆస్వాదించాలి. అవకాసం వస్తే మనకు చేతనైతే ఇతరులకు సహాయం చెయ్యాలి. కొత్తవి ఎదన్న ప్రయత్నించాలి, వేరే ప్రదేశాలని చూడాలి. మన అమ్మమ్మలతో, నానమ్మలతో కాసింత సమయం కేటాయించాలి.  ఇలా ప్రతి అవకాసం లో ఆనందాలని వెతుకుంటే, జీవితాంతం లో జీవితం అంతం రెండు బాగుంటాయి. 


13, అక్టోబర్ 2012, శనివారం

మా ఇంటి మిథునం



 శ్రీ రమణ గారు రాసిన మిథునం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈ కథ కి చాల మందే అభిమానులు ఉన్నారు, ఎన్నో భాషల్లోకి అనువందిన్చబడింది, ఎన్నో ప్రశంసలు పొంది తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలో సినిమా లాగ కూడా రాబోతుంది. దీనికి లింక్ ఇక్కడ



ఈ కథ నాకు నచ్చడానికి ముఖ్య  కారణం అందులో పెరటిని వర్ణించిన తీరు. ఇంట్లో మొక్కలు పెంచితే ఇంటికి ఒక కొత్త కళ వస్తుందని నా ప్రగాడ నమ్మకం, నేను ఇప్పుడు ఉంటున్న చిన్న గది లో కూడా నాలుగు మొక్కలు పెంచుకుంటూ నేను సైతం ప్రపంచానికి ప్రాణవాయువు ఇచ్చి పోసాను అని పాట పాడేసుకుంటున్నాను. విషయానికి వస్తే ఈ కథ అప్పలదాసు, బుచ్చిలక్ష్మి అనే వృద్ద దంపతుల గురించి, ఇద్దరు తొంబై మీద పడ్డవాళ్ళే.  వారి మధ్య జరిగే సంభాషణలు, చమత్కారాలు , కారాలు మిరియాలు, వారి మధ్య ప్రేమానురాగాలు, అబ్బా ఎంత చెప్పిన తక్కువే, దంపతులంటే ఇలా ఉండాలి అనే లా ఉంటారు. ఐతే ముక్యంగా వాళ్ళ పెరడు గురించి చెప్పుకోవాలి, అందులో అందంగా పెంచుకున్న అరటి చెట్లు, అల్లం మోసులు, కంద పిలకలు, కంచేవారగా కాకర బీర దొండ తీగలు, కూర మడులు, బాదం, దబ్బ నిమ్మ, ఉసిరి, కొబ్బరికాయ చెట్లు, మందారాలు, మంకెనలు, కనకాంబరాలు, తీగ మల్లెలు ఇలా ఎన్నో ఎన్నెన్నో....ఒక చిన్నఅందమైన పొదరిల్లు  


అంత వయసు మీద పడ్డా సొంత బిడ్డల్లాగా చూసుకొనే పెరటిని నా ఊహల్లో అంతకంటే అందంగా చిత్రిన్చేసుకున్నాను. దీనికి కారణం అచ్చం అలాగే మా ఊరిలో మా నానమ్మ, అమ్మ కలిసి పెంచిన అందమైన పెరడు. కాయగూరల మొక్కలు, పళ్ళ చెట్లు, పూల మొక్కలు , కొన్ని ఔషధ మొక్కలు, ఇంకోన్ని పిచ్చి మొక్కలు అన్ని కలిపి మా ఇల్లు పచ్చని పరికిణి కట్టుకున్న అందమైన అమ్మాయి లాగ ఉంటుంది. ఈ తోట ని ఇన్ని రకాల మొక్కలతో నింపిన మా నానమ్మ ఓర్పు ని మెచ్చుకోక మానలేము. ఎ ఊరికి వెళ్ళిన వెంట  ఒక మొక్క కచితంగా తెస్తుంది, అలా ఎన్నో రకాల చెట్లతో మా ఇల్లు కళకళలాడుతుంటుంది . ఇంక సంత కెళ్ళి కూరగాయలు కొననవసరం లేదు, దాదాపుగా ఇంట్లో రోజు వండే కూరగాయలన్ని తాజాగా చెట్టు మీద నుండి పొయ్యి లోకి పడతాయి. వీటి రుచి గురించి మళ్ళి ప్రత్యేకంగా చెప్పాలా. ఈ కూరలకి డబ్బు వాసన ఉండదు, దళారుల చేతు కంపు ఉండదు అందుకే వీటిని వండేటప్పుడు వచ్చే గుమగుమలు మహాద్బుతం. బృ కాఫీ ad లో అన్నట్టు రంగు, రుచి, చిక్కదనం అన్ని ఉంటాయి. నా చిన్నప్పుడు నీళ్ళు తాగడానికి వంటిట్లోకి వస్తే, మా అమ్మ కరివేపాకు రెమ్మ ఒకటి విరిచుకొని తీసుకురామ్మ అనేది. ఒక రెమ్మ అలా లాగేసి పోపు లోకి పడేస్తుంటే ఆ వాసనని ముక్కుపుటాల్లోకి  నిండుగా నింపుకొంటె  ఆహా, అలాంటి వసాన మళ్ళి ఇంక ఎక్కడ నాకు తగలలేదు.

ఇంట్లోకి ఏ కూర వండాలా అన్నది ప్రతి రోజు ప్రతి ఆడపడుచు ఎదురుకొనే ప్రశ్నే, కాని మా ఇంట్లో అలా కాదు, ఎ చెట్టు కైతే ఇంటికి సరిపడా కాయలు కాస్తాయో అది వండడమే. వంకాయలు, బెండకాయల చెట్లు, కాకరకాయ, దొండకాయల తీగలు, బచ్చల కూర,  మిరపకాయ తోటల్లో కాసే పాలాకూర ఇలా ఎన్ని రకాలో....మిరపకాయ తోటల్లో అక్కడక్కడ టమాట విత్తనాలు , దోసకాయ విత్తనాలు వేస్తారు మా తాతయ్య , ఇంక వీటికి డోకా ఎలాగో లేదు. అదే తోటలో ఒక చివరగా కాసిన్ని ఉల్లిగడ్డలు నాటితే, సంవత్సరానికి సరిపడా ఉల్లిగడ్డలు బస్తాల్ల్లో నింపుకోవచ్చు. వరి ఎలాగో  ముఖ్యమైన పంట కాబట్టి, బియ్యం మా నాన్న పండించిందే. ఇప్పుడు నేను ఉంటున్న దేశం లో బియ్యం తింటుంటే తెలుస్తుంది, మా ఊరి బియ్యం విలువ.  అలా పళ్ళెం లో ఉన్న పదార్థాలన్నీ పెంచిన  చేతులే తింటుంటే, పుట్టిన చోటే గిట్టడ్డం, సొంత ఊరిలోనే సమాధి అయిపోయిన ఆనందం ఆ మొక్కలకి కూడా ఉంటుందేమో.

పూల మొక్కల గురించి చెప్పకపోతే అలుగుతాయి , మా పడక గది కిటికిని ఆనుకొని పాకిన మల్లె చెట్టు కి కోసుకున్నవాడికి కోసుకున్నంత పూలు, మా మల్లె చెట్టు ని అలా  వంటరిగా వదిలేయకుండా వాటి నేస్తాలు కనకాంబరాలు, ధవనం చెట్లు దాని నీడలో హాయిగ పెరుగుతాయి. వీటి మూడిటిని కలిపి అల్లి  జడ లో  పెట్టుకుంటే కిలోమీటర్ దూరం వరకు సువాసన  గుప్పుమంటుంది. చేమంతులైతే  తోట్లల్లో పెరుగుతూ నిండుగా తొట్టి అంత ఒక పెద్ద పువ్వేమో అనిపిస్తుంది. ఈ మధ్య వాసన లేని ఆర్నమెంటల్ మొక్కలు కూడా వచ్చేసాయి. చూడడానికి అందంగా ఉన్నా, ఎక్కువ మందిని ఆకర్చించిన మా మల్లె చెట్టే మాకు మహారాణి. పల్లెటూరి ఆడపడుచు, సిటీ పాపలకు తేడా లాగ అన్నమాట.

 ఈ చిన్ని చిన్ని మొక్కల మధ్య మహారాజులలా ఇంటి ఆవరాణలో నాలుగు కొబ్బరి  చెట్లు, ఒక జామచేట్టు, ఈ మధ్యేచనిపోయిన దాన్నిమ్మ చెట్టు ఉన్నాయి. వీటి నీడలో మంచం వేసుకొని పడుకుంటే దొరికే సుఖం  ఇంక నేను మాటల్లో చెప్పలేను.

ఒక్కసారి ఈ దేశాన్ని విడిచి అలా మా ఊరికి వేల్లిపోవాలనుంది. చిన్నపుడు చెట్లకి నీళ్ళు పోయ్యమంటే, నానా సాకులు చెప్పి తప్పించుకున్నాను మళ్లి  వెనక్కి వెళ్లి ప్రతి మొక్కని తడిమి తడిమి నీళ్ళు పోయ్యాలని  ఉంది.