ఆకాశం బూడిద రంగు లోకి మారిపోయింది. పగటి వెలుతురికి, రాత్రి చీకటికి మధ్యగా ఉండే వర్ణం భలే బాగుంది. చల్లని గాలికి చెట్లు, ఆకులు నాట్యాలు చేస్తున్నాయి. మిద్దే మీద ఆరేసిన వడియాలు, బట్టలని హాదివిడిగా తీయడానికి పరుగులు పెట్టాము, అంతలోపే మెల్లగా చినుకులు మొదలయ్యాయి. చిలుకులన్ని కలిసి వానగా మారిపోతుంది. ఇంటి ముందు కూర్చొని సజ్జే మీద నుండి పడుతున్న చినుకులని కొన్ని చేతిలోకి పట్టుకోవాలనే తాపత్రయ పడుతున్నాం. అప్పుడే అమ్మ వేడి వేడి పకోడీ చేసి తెచ్చింది. చిక్కని కాఫీ తాగుతూ పకోడిని తింటూ, అడపా దడపా గొడుగు పట్టుకొని అలా వర్షం లోకి వెళ్లి వస్తున్నాం. వాన లో స్నానం చేస్తున్న చెట్ల సంతోషాన్ని చూస్తున్నాం. టైటానిక్ పడవలను పోలే మా కాగితం పడవలు ఇంటి ముందు వెలిసిన చిన్న మడుగుల్లో ఏదో తీరానికి చేరాలని ప్రయత్నిస్తూ, పడుతున్న చినుకుల తాకిడికి చితికిల పడిపొయ్యి, నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి. వాన ఎంత పడ్డదో కొలవడానికి మా నాన్న తెచిన్న rain guage ని పదే పదే వెళ్లి చూస్తున్నాం. ఒక్క సెంటీమీటర్, రెండు సెంటీమీటర్...హమ్మయ్య ఇంత వాన చాలు.. ఇంక చేల దాహం తీరినట్టే అని మా అమ్మ, నాన్న సంతోచిస్తున్నారు. వర్షం కొంచం తగ్గుముఖం పడుతున్న సూచనలు మొదలవ్వడం తో ఇంక ప్లాస్టిక్ సంచులతో అందరం సిద్ధంగా ఉన్నాం. ఇంట్లో నుండి అమ్మ అరుపు అనుకుంటా " వాన లో ఆడకండి, పడిశం పడుతుంది" అని, అవి మా చెవుల్లోకి ఎక్కితే కదా...ఇంక మొదలవుతాయి మా వాన ఆటలు, కేరింతలు. ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకోవడం. చెట్టు మీద కాయ ఉంది అని చూపించి చెట్టు ని విదిలించడం, ఎవరి పడవ ఎంత దూరం వెళ్తుంది అని పందెం కట్టుకుంటూ ఉండగా వాన వేలిసిపోతుంది. ఆకాశానికి కూడా మా ఆనందం చూడడం ఇష్టమేమో మబ్బులని పక్కకు నెట్టేసి, మా వైపు నిండు గా, నీలపు రంగు లో కి మారిపోయ్యి చూస్తూ నవ్వుతుంది.
వాన వేలిసిన వెంటనే మా ఆటలు ఆగిపోవు, అలా రోడ్ పక్కన వాగులో ఎంత వాన పడిందో చూడడానికి అందరం బయలుదేరుతాం. ప్రకృతి అంతా స్నానం చేసి అలంకరించుకున్నట్టు చాల అందంగా ఉంది. రోడ్ కూడా నల్లగా మేరుస్తుంది. ఆ వాగు లోకి దిగి మల్లి ఇంకోసారి ఆడుకున్నాం. బురద లో నడుచుకుంటూ, చేలలోకి వెళ్లి మా చిన్ని చేతుల్లో పట్టినంత బంక మట్టి తెచుక్కొని, ఒక్కొక్కరం శిల్పాలు చెక్కే శిల్పి లెవెల్ లో pose కొడుతూ ఆ బంక మట్టితో ఏనుగు, గుర్రం, గాడిద, ఆవు ( అన్ని ఒకేలాగా ఉంటాయనుకో కాని వేరే వేరే పేర్లు పెట్టేవాళ్ళం మా కళ ని మేమే ఆధారించుకోవాలి కదా మరి !) చేసేవాళ్ళం. అదే బంక మట్టి తో చిన్ని చిన్ని కుండలు, వాటికి మూతలు, అందులో పెట్టడానికి మురుకులు, లడ్లు కూడా చేసేవాళ్ళం. కూర గిన్నె, అన్నం గిన్నె ఇలా ఏవో రకాలు చేసి ఒక వంట ఇంటికి కావాల్సిన సామగ్రి చేసే వాళ్ళం. మరుసటి రోజు కొంచం ఎండబెడితే ఇంక పావులాట ఆడుకోవచ్చు చక్కగా...
అంతా అయిపోయాక వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి, చక్కగ బుట్ట బొమ్మ లాగ తయ్యారయ్యి అన్నం తిని హాయిగా బజ్జుకొనే వాళ్ళం. ఇలా వాన వచ్చిన రోజు మాకు పండగే. అంత తడిసినా కూడా " పిల్లకి పీట చేక్కకి చలి పెట్టదు" అని మా అమ్మ చెప్పే సామెత ని నిజం చేస్తూ మరుసటి రోజు పుష్కలంగా ఆరోగ్యంగా మల్లి ఆటల్లోకి జారుకొనే వాళ్ళం. పావులని ఎండబెట్టాలి, అందులో వంటలు చెయ్యాలి కదా మరి...
సిటీ లో ఈ ఆనందాలు దొరకవు, ఈ నాగరికపు జీవితం లో బందిలమైపోయ్యి, వాన ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్లిందో కూడా గమనించడం లేదు. ఆనందించడం పక్కన పెట్టి, రోడ్లంత నిండి పొయ్యి, ఎందుకు పడింది ఈ వాన అని తిట్టుకొనే ధుస్థితికి దిగజారం.....
వాన సినిమా లో త్రిష వాన తో ' నువ్వస్తానంటే నెనొదంటనా ' అని పాడుతుంది కాని మనం నువ్వు (వర్షం) వస్తానన్న పిలుపు నాకు వినిపించడం లేదు, వద్దు అని చెప్పే అంత సమయం కూడా నాకు లేదు అని పాడుకోవాలి నిజమే మరి చుట్టంలా వస్తుంది, చూసే దిక్కు లేక వెళ్ళిపోతుంది మన వాన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి