ఇదేం టైటిల్ అని ఆశ్చర్యపోతున్నారా.. Hungary బాష లో ఎలా ఉన్నావు అని అర్ధం.....
పోయిన నెల Hungary దేశ రాజధాని బుడాపెస్ట్ కి నేను నా స్నేహితులం కలిసి వెళ్ళాం...Danube నది తీరం మీద నిర్మించబడినది ఈ నగరం...ఇన్ని రోజులు బుడాపెస్ట్ ఒకే నగరం అని అనుకున్నాను ఇక్కడికి వచ్చాకే తెలిసింది బూడ మరుయు పేస్తో రెండు నగరాలని కలిపి బుడాపెస్ట్ అంటారని...
Danube నది తూర్పు దిక్కున బూడ నగరం, పడమర దిక్కున పేస్తో నగరం ఉన్నాయి...నన్ను బాగా ఆకట్టుకుంది మాత్రం బూడ నగరం, ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగి కొండలతో, హంగరి రాజుల కోటలతో చాల చాల అందంగా ఉంది.
బుడాపెస్ట్ లో చూడ దగ్గ ప్రదేశాలు
1) Castle Hill
నాకు బాగా నచ్చిన ప్రదేశం బూడ నగరం లో ఉన్న ఈ కొండ...ఇక్కడికి చేరుకోవడానికి మంచి బస్సు సౌకర్యం ఉంది...నాకు ఎతైన ప్రదేశాలంటే చాల ఇష్టం..అలా పై నుండి ప్రపంచాన్ని చూస్తుంటే ప్రతిది అందంగానే అనిపిస్తుంది. ఈ ప్రదేశం రాత్రి చూస్తే ఇంకా ఇంకా బాగుంటుంది... రెండు ప్రయత్నించవచ్చు
ఇంత ఎత్తు మీద హంగరి రాజు గారు మంచి కోట కట్టుకున్నారు...కోట లో కొంత భాగం శిధిలావస్థ లో ఉన్నా చాల భాగం ఇంకా చెక్కు చెదరకుండా గట్టిగా ఉంది...ఇక్కడ musuem, ఈ కొండ ఎక్కడానికి వింతగా బుల్లిగా ఉన్న రైలు తప్పకుండ వెళ్లి తీరాల్సిందే...
ఈ కొండ మీద బస్సు దిగగానే కనిపించే restaurant లో కి దూరి పోయ్యాము నేను మా స్నేహితులం కలిసి...అక్కడ chocolate కేకు ఆర్డర్ చేసాను... నా సామి రంగ... ఏమి ఆ కేకు...ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది.. అద్బుతం..మహా అద్బుతం. కచితంగా ప్రయత్నించండి....
2) Orszaghaz (పార్లమెంట్ )
ఆ పేరు చదివి పలకడం కంటే నోరు మూసుకోవడం మంచిది అని నిర్నయిన్చేసుకున్నాము అందరం...ఈ దేశం లో పేర్లు పలకడానికి అస్సలు ప్రయత్నించకూడదు, రాసినదానికి పలికినదానికి పొంతే ఉండదు ఈ బాషలో..అందుకే చదువు రాని వాళ్ళలాగా కాగితం మీద రాసుకొని అయ్యా ఈ ప్రదేశం వెళ్ళాలి, కొంచం ఏ బస్సు ఎక్కాలో చెప్తారా అంటూ పని కానిచాము...
హన్గేరియన్ పార్లమెంట్ ని danube నది ఒద్దు మీద పేస్తో నగరం లో కట్టారు, బూడ వైపు నుండి చూస్తే చాల అందంగా నది మీద తేలుతుందా అనిపించేటట్టు బలే ఉంటుంది. నేను ఇంత వరకు చూసిన కట్టడాల్లో ఇది బెస్ట్. బూడ నుండి చూస్తే చచినట్టు కనిపిస్తుంది కాబట్టి, మిస్ అయ్యే సమస్యే లేదు...రాత్రి కూడా చాల లైట్ లు వేసి వెలిగిస్తారు కాబట్టి ఇంకా అద్బుతంగా ఉంటుంది. ఈ పైన ఉన్న బొమ్మ రాత్రి తీసింది
3) హీరోస్ స్క్వేర్
హంగరి దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజులు, సేనాధిపతులు, సైనికుల స్మారక చిహ్నం ఈ హీరోస్ స్క్వేర్. నగరం నడిబొడ్డున కట్టినా విశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రదేశం. పక్కనుండి కోటానుకోట్ల కార్లు, బస్సులు వెళ్తున్న కూడా ఈ ప్రదేశం లో నిలబడితే ఒక లాంటి నిశబ్ధం ఆవహిస్తుంది. ప్రాణాలు పనంగా పెట్టి ఈ దేశం కోసం యుద్ధం చేసిన వాళ్ళ విగ్రహాలను సూటిగా కళ్ళలోకి చూస్తుంటే భయం వేస్తుంది. గంభీరంగా రొమ్ము విరుచుకొని నిలబడ్డ సైనికులను, రాజులని చూస్తుంటే ఇలా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం లో కూడా ఆనందం ఉంటుందని అక్కడ నిలుచుంటే బోద పడింది. తప్పకుండ చూడవలసిన స్క్వేర్.
4) షూస్ ఆన్ ది డానుబ్ ( Shoes on the Danube )
"ఎ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం, నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం" శ్రీ శ్రీ గారు అన్న మాటలు గుర్తొచ్చాయి ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు.
ఐరోపా ఖండానికి నల్ల మచ్చ యూదులని దారుణంగా హత్య చేయడం. హంగరీ దేశం కూడా దీనికి అతీతం కాదు. రెండో ప్రపంచ యుద్ధం లో యూదులను Danube నది ఒడ్డు న నిలబెట్టి కాల్చి నీళ్ళల్లోకి తోసి చంపేశారు. అలా చంపే ముందు వాళ్ళ చెప్పులను విడిచివేయ్యమని చెప్పి కాల్చారంట అందుకే ఈ దారుణానికి చింతిస్తూ వారి స్మారకంగా చెప్పులు పెట్టారు నది ఒడ్డున.
ఏమనుకోవాలి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకోవడం తప్ప...
యూదులకు పట్టిన స్థితి మళ్ళి ప్రపంచ చరిత్ర లో ఎవ్వరికి పట్టకూడదు దెవుడా.....
మాకు టైం సరిపోక వెళ్ళలేదు కాని బుడాపెస్ట్ లో తప్పకుండ చేయవలసినది, ఔషధ విలువలు కలిగిన ఈత కొలనులలో ఈదడం. ఇక్కడ ఈత కొలనులు సహజమైనవి, మట్టి లో ఉండే అనేక మినరల్స్ నీటి లో కలిసి చర్మ వ్యాధులని నివారిస్తుందని ప్రసిద్ధి. టైం ఉంటె తప్పకుండ ప్రయత్నించండి.
అన్ని చెప్పుకొని తిండి గురించి మరిచిపోయ్యాను...స్వచమైన హన్గేరియన్ రుచులు ప్రయత్నించాలంటే మంచి హోటల్ కి వెళ్ళడం ముఖ్యం. మేము వెతికి వెతికి ఒరిజినల్ హన్గేరియన్ తిండి దొరికే Udvarhaz అనే restaurant కి వెళ్ళాము. ఇది కొండ పైన ఎక్కడో అడవి లో కట్టారు. గంట సేపు ప్రయత్నించి మొతానికి చేరుకున్నాం. చేరుకోవడం తోనే హన్గేరియన్ అమృతం అని చెప్పి 30% alcohol ఉన్న బుడ్డి సీస చేతిలో పెట్టారు. బాబు మీ అమృతం తాగే అర్హత నాకు లేదు అని సవినయంగా ఒప్పుకొని పళ్ళ రసం పుచుక్కున్నాను. తర్వాత traditional హన్గేరియన్ నృత్య ప్రదర్శన సంగీతం బలే బాగున్నాయి. కాళ్ళతోనే శబ్దం చేస్తూ మంచి సంగీతం పుట్టించారు (tap dancing). హంగరీ గులాష్ సూప్ ప్రపంచ ప్రక్యాతి పొందింది. అది మన పళ్ళెం లో మొదటగా పడింది. మల్లి చిక్కు ఎదురైంది. అందులో పంది మాంసం ఉంది మరి. సూప్ తాగి మిగితాది వేదిలేసాను. నిజం చెప్పాలంటే, నేను చేసే మిర్యాల చారు లాంటి మిర్యాల చారు లాగ ఉంది ఈ సూప్. తర్వాత పుట్టగోడుగులతో, టమటలతొ, చికెన్ తో చేసిన వంటకం అధుర్స్...రెండు సార్లు తిని హంగరి దాత సుఖీభవ అని ధీవించెసాను.
హంగరీ దేశ చరిత్ర, బాష, తిండి, సంస్కృతికి అద్దం పడుతుంది బుడాపెస్ట్ నగరం. చూడవలసిన చక్కటి ప్రదేశం. వీలైతే మీరు చూడండి.