7, డిసెంబర్ 2012, శుక్రవారం

ఒక పూటలోనే రాలు పూలెన్నో



పసుపు పచ్చని రంగు లో కుంచె ని ముంచి, లోకమంతా పూసినట్టు ఉండే , మొన్ననే వచ్చి అంతలోనే వెళ్ళిపోయిన గ్రీష్మ ఋతువు. మన దేశం లో దీన్ని తీవ్రత అంతగా తెలియదు కాని ఐరోపా ఖండంలో, అమెరికా లో ఇది కొంత కాలము ఉండి ఎంతో అందంగా ఉంటుంది. నాకు ఈ ఆకు రాలు కాలం అంటే చాల ఇష్టం.కిటికీ పక్కన కూర్చొని మంచి కాఫీ కలుపుకొని తాగుతూ రాలిపోతున్న ఆకులని  చూస్తుంటే జీవిత సత్యాలు ఒక్కొక్కటే బోధ పడుతాయి. అవును రాలిపోతున్న ఆకులలాగే మన జీవితం కూడా చాల చిన్నది కదా మరి. వాటికి నాలుగు మాసాలు జీవితమైతే మనకు డెబ్బై సంవత్సారాలు జీవితం. చివరికి రెండు పండు పండి రాలిపోవాల్సిన్దే. 

రాలిపోయిన ప్రతి ఆకు, ప్రతి పువ్వు ని ఆ తల్లి  చెట్టు గుర్తు పెట్టుకుంటుందా ? పుట్టిన ప్రతి మనిషిని ఈ భూమాత గుర్తుపెట్టుకుటుందా ?? మన జీవితం కూడా అంతే, మన మునిమనవరాళ్ళు, మునిమన్నవళ్ళు గుర్తుపెట్టుకొనేదాకే , అంటే 150 సంవత్సారాల తర్వాత మనం ఒకరం పుట్టాము అన్న  సంగతి ఈ ప్రపంచం మర్చిపోతుంది.  

మొన్న ఏదో ఒక పుస్తకం లో చదివాను సూర్యుడు వయసు  4,500,000,000 సంవత్సరాలంట. ఈ సంఖ్యని మనిషి కాలమానానికి కుదిస్తే, సూర్యుడు 37వ సంవత్సారాల వయసు వాడైతే, మనిషి పుట్టింది ఎనిమిది గంటల క్రితమే. cosmic scale లో మనం రెప్ప వాల్చిన అంత చిన్న వయసు వాళ్ళం. హ్మ్మ్ ఎంత అల్పులం కదా. 

నిన్న ఉండి రేపు పొయ్యే జీవితం లో ఎన్ని అలజడులు, ఎన్ని ఆశలు, ఎన్ని ఆనందాలు. డబ్బే సర్వసం అయిన రోజుల్లో బ్రతుకుతున్నాం. డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోతున్నాము. చిన్న చిన్న ఆనందాలకు దూరమవుతున్నాము. జీవితాన్ని ఆస్వాదించడం మరిచిపోతున్నాము. జీవితం చాల చిన్నది అని గుర్తుంచుకొని ప్రతి రోజు ని ఆనందంగా గడపాలి. 


బాల్యం లో చదువుతోనే కాలం గడిచిపోతుంది, యవ్వనం లో సంపాదన తోనే సమయం గడిచిపోతుంది, తర్వాత పిల్లల పెంపకం, ఆ తర్వాత వ్రుధాప్యం లో చావు కోసం ఎదురుచూడడం, ఇంక జీవితం లో ఆనందం ఎక్కడుంది ? ఇది మనం సాధారణంగా చెప్పుకొనే సమాధానం, కాని రోజు మనం చేసే పనులలోనే ఆనందం వెతుకోవాలి, వీలైనప్పుడల్లా ప్రకృతిని ఆస్వాదించాలి. అవకాసం వస్తే మనకు చేతనైతే ఇతరులకు సహాయం చెయ్యాలి. కొత్తవి ఎదన్న ప్రయత్నించాలి, వేరే ప్రదేశాలని చూడాలి. మన అమ్మమ్మలతో, నానమ్మలతో కాసింత సమయం కేటాయించాలి.  ఇలా ప్రతి అవకాసం లో ఆనందాలని వెతుకుంటే, జీవితాంతం లో జీవితం అంతం రెండు బాగుంటాయి.