శ్రీ రమణ గారు రాసిన మిథునం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈ కథ కి చాల మందే అభిమానులు ఉన్నారు, ఎన్నో భాషల్లోకి అనువందిన్చబడింది, ఎన్నో ప్రశంసలు పొంది తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలో సినిమా లాగ కూడా రాబోతుంది. దీనికి లింక్ ఇక్కడ
అంత వయసు మీద పడ్డా సొంత బిడ్డల్లాగా చూసుకొనే పెరటిని నా ఊహల్లో అంతకంటే అందంగా చిత్రిన్చేసుకున్నాను. దీనికి కారణం అచ్చం అలాగే మా ఊరిలో మా నానమ్మ, అమ్మ కలిసి పెంచిన అందమైన పెరడు. కాయగూరల మొక్కలు, పళ్ళ చెట్లు, పూల మొక్కలు , కొన్ని ఔషధ మొక్కలు, ఇంకోన్ని పిచ్చి మొక్కలు అన్ని కలిపి మా ఇల్లు పచ్చని పరికిణి కట్టుకున్న అందమైన అమ్మాయి లాగ ఉంటుంది. ఈ తోట ని ఇన్ని రకాల మొక్కలతో నింపిన మా నానమ్మ ఓర్పు ని మెచ్చుకోక మానలేము. ఎ ఊరికి వెళ్ళిన వెంట ఒక మొక్క కచితంగా తెస్తుంది, అలా ఎన్నో రకాల చెట్లతో మా ఇల్లు కళకళలాడుతుంటుంది . ఇంక సంత కెళ్ళి కూరగాయలు కొననవసరం లేదు, దాదాపుగా ఇంట్లో రోజు వండే కూరగాయలన్ని తాజాగా చెట్టు మీద నుండి పొయ్యి లోకి పడతాయి. వీటి రుచి గురించి మళ్ళి ప్రత్యేకంగా చెప్పాలా. ఈ కూరలకి డబ్బు వాసన ఉండదు, దళారుల చేతు కంపు ఉండదు అందుకే వీటిని వండేటప్పుడు వచ్చే గుమగుమలు మహాద్బుతం. బృ కాఫీ ad లో అన్నట్టు రంగు, రుచి, చిక్కదనం అన్ని ఉంటాయి. నా చిన్నప్పుడు నీళ్ళు తాగడానికి వంటిట్లోకి వస్తే, మా అమ్మ కరివేపాకు రెమ్మ ఒకటి విరిచుకొని తీసుకురామ్మ అనేది. ఒక రెమ్మ అలా లాగేసి పోపు లోకి పడేస్తుంటే ఆ వాసనని ముక్కుపుటాల్లోకి నిండుగా నింపుకొంటె ఆహా, అలాంటి వసాన మళ్ళి ఇంక ఎక్కడ నాకు తగలలేదు.
ఇంట్లోకి ఏ కూర వండాలా అన్నది ప్రతి రోజు ప్రతి ఆడపడుచు ఎదురుకొనే ప్రశ్నే, కాని మా ఇంట్లో అలా కాదు, ఎ చెట్టు కైతే ఇంటికి సరిపడా కాయలు కాస్తాయో అది వండడమే. వంకాయలు, బెండకాయల చెట్లు, కాకరకాయ, దొండకాయల తీగలు, బచ్చల కూర, మిరపకాయ తోటల్లో కాసే పాలాకూర ఇలా ఎన్ని రకాలో....మిరపకాయ తోటల్లో అక్కడక్కడ టమాట విత్తనాలు , దోసకాయ విత్తనాలు వేస్తారు మా తాతయ్య , ఇంక వీటికి డోకా ఎలాగో లేదు. అదే తోటలో ఒక చివరగా కాసిన్ని ఉల్లిగడ్డలు నాటితే, సంవత్సరానికి సరిపడా ఉల్లిగడ్డలు బస్తాల్ల్లో నింపుకోవచ్చు. వరి ఎలాగో ముఖ్యమైన పంట కాబట్టి, బియ్యం మా నాన్న పండించిందే. ఇప్పుడు నేను ఉంటున్న దేశం లో బియ్యం తింటుంటే తెలుస్తుంది, మా ఊరి బియ్యం విలువ. అలా పళ్ళెం లో ఉన్న పదార్థాలన్నీ పెంచిన చేతులే తింటుంటే, పుట్టిన చోటే గిట్టడ్డం, సొంత ఊరిలోనే సమాధి అయిపోయిన ఆనందం ఆ మొక్కలకి కూడా ఉంటుందేమో.
పూల మొక్కల గురించి చెప్పకపోతే అలుగుతాయి , మా పడక గది కిటికిని ఆనుకొని పాకిన మల్లె చెట్టు కి కోసుకున్నవాడికి కోసుకున్నంత పూలు, మా మల్లె చెట్టు ని అలా వంటరిగా వదిలేయకుండా వాటి నేస్తాలు కనకాంబరాలు, ధవనం చెట్లు దాని నీడలో హాయిగ పెరుగుతాయి. వీటి మూడిటిని కలిపి అల్లి జడ లో పెట్టుకుంటే కిలోమీటర్ దూరం వరకు సువాసన గుప్పుమంటుంది. చేమంతులైతే తోట్లల్లో పెరుగుతూ నిండుగా తొట్టి అంత ఒక పెద్ద పువ్వేమో అనిపిస్తుంది. ఈ మధ్య వాసన లేని ఆర్నమెంటల్ మొక్కలు కూడా వచ్చేసాయి. చూడడానికి అందంగా ఉన్నా, ఎక్కువ మందిని ఆకర్చించిన మా మల్లె చెట్టే మాకు మహారాణి. పల్లెటూరి ఆడపడుచు, సిటీ పాపలకు తేడా లాగ అన్నమాట.
ఈ చిన్ని చిన్ని మొక్కల మధ్య మహారాజులలా ఇంటి ఆవరాణలో నాలుగు కొబ్బరి చెట్లు, ఒక జామచేట్టు, ఈ మధ్యేచనిపోయిన దాన్నిమ్మ చెట్టు ఉన్నాయి. వీటి నీడలో మంచం వేసుకొని పడుకుంటే దొరికే సుఖం ఇంక నేను మాటల్లో చెప్పలేను.
ఒక్కసారి ఈ దేశాన్ని విడిచి అలా మా ఊరికి వేల్లిపోవాలనుంది. చిన్నపుడు చెట్లకి నీళ్ళు పోయ్యమంటే, నానా సాకులు చెప్పి తప్పించుకున్నాను మళ్లి వెనక్కి వెళ్లి ప్రతి మొక్కని తడిమి తడిమి నీళ్ళు పోయ్యాలని ఉంది.