27, సెప్టెంబర్ 2012, గురువారం

ఆవేదన, ఆక్రందన, ఆలాపనా, నా ప్రార్ధన



అడుగు ఐతె  వేసాను కాని దారి ఎటువైపు, బ్లాగ్ మొదలుపెట్టాను కాని మొదటి టపా ఎం వ్రాయాలి అని ఆలోచిస్తూ ఈరోజు నేను పని చేసే హాస్పిటల్ లోకి వస్తున్నాను,  (నేను చిన్న పిల్లలకు రక్తంలో వచ్చె కాన్సెర్ మీద పరిశోధన చేస్తాను), అక్కడ తోపుడు కుర్చీ లో ఒక ఎనిమిది-తొమ్మిది సంవత్సరాల అబ్బాయి కనిపించాడు. కాన్సెర్ భారిన పడడం వల్ల జుట్టు అంతా రాలిపోయింది. పక్కనే వాళ్ళ నాన్న తో ఏదో మాట్లాడుతున్నాడు. చేతులకి ఏవో పైపులు, సూదులు తగిలించారు. ఇలాంటి పిల్లలని రోజు చూస్తున్నా, ఈరోజు ఎందుకో ఒకలాంటి బాధ మనస్సు ని ఆవహించింది . అప్పుడే దీని గురించి ఒక టపా రాయాలని నిర్ణయించుకున్నాను.

చిన్నపుడు ఎప్పుడో గీతాంజలి సినిమాలో నాగార్జున కి acute myeloid leukemia అని అరుణ చెప్పినప్పుడు ఆహా ఎంత బాగుంది ఆ జబ్బు పేరు, ఆ జబ్బు నాకు వస్తే బాగుండు చక్కగా నాగార్జునలా శాలువ కప్పుకొని ఊటీ కి వెళ్లి  ఆమని పాడవే హాయిగా అని పాట పాడుకోవచనుకోనేదాన్ని. ఇప్పుడు ఈ ఆలోచనకి నవ్వొస్తుంది. అయినా  బాల్యం లో వెల్లకాయంత వెర్రి ఉంటేనే కౌమారం, యవ్వనం, వృధ్యాప్యం మధురంగా ఉంటాయి కదా.

మన తెలుగు సినిమాలలో పాతిక లేదా పది శాతం సినిమాలు కథానాయకుడు లేదా కథానాయిక cancer భారిన  పడి చనిపోవడం మీదే కథను అల్లడం మనకు సుపరిచితమే, కాని ఇది నిజ జీవితం లో ఎంత కల్లోలం సృష్టిస్తుందో స్వయంగా చూసినవాళ్ళకే తెలుస్తుంది. మా వైద్యశాలలో ప్రతి రెండు వారాలకి ఒక చావు కబురు, నిన్న చూసిన పిల్లలు ఈరోజు లేరు, ఈరోజు చూస్తున్వా వాళ్ళ మొహాల్లో చావు ని వెతుకోనవరసం లేదు, స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా అందరు ఐదు నుండి పదహారు సంవత్సరాల లోపు పిల్లలే. జీవితం లో ఇంకా ఏది చూడకుండానే, జీవితం అంటే ఏంటో తెలియకుండానే రాలిపోతున్న ఈ మొగ్గలని చూస్తుంటే కలిగే ఆవేదన వర్ణనాతీతం.

ఇంత మంది పిల్లలు పెద్దలు ఈ కాన్సెర్ భారిన పడుతుంటే డాక్టర్స్ ఎం చేస్తున్నారు ? వైద్యం, పరిశోధన ఎం చేస్తున్నాయి? అన్న ప్రశ్న సహజంగా మన అందరి మదిలో మెదులుతుంది. కాని నిజానికి కాన్సెర్ వ్యాధి మీద ఎంతో పరిశోధన జరుగుతుంది, కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు, యూరోలు, డాలర్లు కాన్సెర్ పరిశోధన కోసం కేటాయింపబడుతున్నాయి. నాకు తెలిసిన కొన్ని మంచి కాన్సెర్ వైద్యశాలలలో పోస్తున్న డబ్బు తో ఆఫ్రికా ఖండం లో ని కొన్ని దేశాలు ఒక సంవత్సరం పాటు తిండి తినోచ్చు అని ఇక్కడ అనుకుంటూ ఉంటారు.

మరి ఫలితాల సంగతి ఏంటి? అక్కడికే వస్తున్నాను. కాన్సెర్ అనే జబ్బు కేవలం ఒక కారణం వళ్ళ రాదు, కారణాల బట్టి కాన్సెర్ లో ఎన్నో రకాలు ఉంటాయి. ఒక్కో క్క శరీర భాగాన్ని బట్టి ఒక్కొక్క రకం ఉంటాయి. మన జన్యువుల్లో సహజంగా కాన్సెర్ ని నిరోధించే genes ఉంటాయి వాటినే tumour suppresive genes అంటారు. చాల రకాల కాన్సెర్ లు ఈ జన్యువుల్లో లోపాల వల్లే వస్తాయి. ఇంటిని శుభ్రం చేసే సాధనమే చెడి పోతే ఇల్లు కి జబ్బు చేయడం అన్నమాట. ఎన్నో జన్యువులు, కొన్ని దురలవాట్లు, తల్లితండ్రుల నుండి సంక్రమించే లోపాలు, ఆహారపుటలవాట్లు, క్రిములు ఇలా ఎన్నో కారణాల వళ్ళ సోకుతుంది  కాబట్టి కచ్చితంగా ఈ మందు వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పలేము. మనిషి మనిషి ని బట్టి మారుతుంది అందుకే  personalized మెడిసిన్ (మనిషిని బట్టి మందు)  అనేది త్వరలో రాబోతుంది. ఇప్పటికే చాల మందులు ఎలుకల మీద ప్రయోగిస్తున్నారు, human trails అంటే మనుషుల మీద ప్రయాగాలు చేసి త్వరలో ఈ చిన్నారులను చేరుకోవాలని నా ఆలాపన. ప్రయోగాల నిమిత్తం వారి శరీరాలను అర్పించి చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని నా ప్రార్ధన.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మొదటి అడుగు

నేను తన గర్భం లో ఉన్నప్పుడే అనుకుందేమో మా అమ్మ నా పేరు లో ఉన్న స్మృతి లాగే నా జీవితం నాకు చాల స్మృతులని మిగిలించాలని, అలా జీవితం మిగిలించిన గత స్మృతుల జ్ఞాపకాల బరువుని కాస్త మీతో పంచుకుందామనే తపనతోనే ఈ బ్లాగ్ ని మొదలుపెడుతున్నాను.  తెలుగు భాష మీద ఉన్న అభిమానమో, నా జీవితం మిగిలించిన తీపిచేదు గుర్తులో, స్వతహాగ అతిగా వాగే అలవాటు ఉండడం వల్లో, నేను రాయగలనా అన్న సందేహపు తెరని చీల్చడానికో తెలిదు కాని వ్రాస్తున్నాను. వ్రాయడం మొదలుపెడుతున్నాను.

మాట మంత్రమైతే మౌనం అమృతం అని ఎక్కడో చదివాను, అతిగా వాగుతున్న నాకు ఈ వాక్యం మౌనాన్ని పరిచయం చేసింది తర్వాత జీవితం నన్ను సప్తసముద్రాలవతలికి లాగేసి మాతృ భాష కనుచూపు మెరలో వినపడని చోటులో పడేసి తిక్క కుదిరిందా అని నవ్వి వెళ్లిపోయింది. అప్పటి నుండి కొత్తగా పరిచయమైనా మౌనపు సంగర్షణ నుండి బయటపడాలన్న దిశగా వేసిన మొదటి అడుగే నా ఈ బ్లాగ్.

భాష మీద పట్టు లేదు చెప్పాలన్న తపన తప్ప
వ్యాకరణం అంటే తెలిదు వ్యక్తపరచాలన్న ఆశ తప్ప

ఒక చిన్న కవిత ప్రయత్నించాను :-)

నేను వేస్తున్న ఈ మొదటి తప్పటడుగు ఎన్ని నడకలు నేర్పుతుందో, ఏ తీరాలకు చేరుస్తుందో, ఎంత మంది బాటసారులను పరిచయం చేస్తుందో చూడాలి. కొన్ని సార్లు గమ్యం చేరామన్న ఆనందం కంటే నడచిన తోవ బాగుంటుంది. ఈ ప్రయాణం ఎలా ఉండబోతుందో.