7, డిసెంబర్ 2012, శుక్రవారం

ఒక పూటలోనే రాలు పూలెన్నో



పసుపు పచ్చని రంగు లో కుంచె ని ముంచి, లోకమంతా పూసినట్టు ఉండే , మొన్ననే వచ్చి అంతలోనే వెళ్ళిపోయిన గ్రీష్మ ఋతువు. మన దేశం లో దీన్ని తీవ్రత అంతగా తెలియదు కాని ఐరోపా ఖండంలో, అమెరికా లో ఇది కొంత కాలము ఉండి ఎంతో అందంగా ఉంటుంది. నాకు ఈ ఆకు రాలు కాలం అంటే చాల ఇష్టం.కిటికీ పక్కన కూర్చొని మంచి కాఫీ కలుపుకొని తాగుతూ రాలిపోతున్న ఆకులని  చూస్తుంటే జీవిత సత్యాలు ఒక్కొక్కటే బోధ పడుతాయి. అవును రాలిపోతున్న ఆకులలాగే మన జీవితం కూడా చాల చిన్నది కదా మరి. వాటికి నాలుగు మాసాలు జీవితమైతే మనకు డెబ్బై సంవత్సారాలు జీవితం. చివరికి రెండు పండు పండి రాలిపోవాల్సిన్దే. 

రాలిపోయిన ప్రతి ఆకు, ప్రతి పువ్వు ని ఆ తల్లి  చెట్టు గుర్తు పెట్టుకుంటుందా ? పుట్టిన ప్రతి మనిషిని ఈ భూమాత గుర్తుపెట్టుకుటుందా ?? మన జీవితం కూడా అంతే, మన మునిమనవరాళ్ళు, మునిమన్నవళ్ళు గుర్తుపెట్టుకొనేదాకే , అంటే 150 సంవత్సారాల తర్వాత మనం ఒకరం పుట్టాము అన్న  సంగతి ఈ ప్రపంచం మర్చిపోతుంది.  

మొన్న ఏదో ఒక పుస్తకం లో చదివాను సూర్యుడు వయసు  4,500,000,000 సంవత్సరాలంట. ఈ సంఖ్యని మనిషి కాలమానానికి కుదిస్తే, సూర్యుడు 37వ సంవత్సారాల వయసు వాడైతే, మనిషి పుట్టింది ఎనిమిది గంటల క్రితమే. cosmic scale లో మనం రెప్ప వాల్చిన అంత చిన్న వయసు వాళ్ళం. హ్మ్మ్ ఎంత అల్పులం కదా. 

నిన్న ఉండి రేపు పొయ్యే జీవితం లో ఎన్ని అలజడులు, ఎన్ని ఆశలు, ఎన్ని ఆనందాలు. డబ్బే సర్వసం అయిన రోజుల్లో బ్రతుకుతున్నాం. డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోతున్నాము. చిన్న చిన్న ఆనందాలకు దూరమవుతున్నాము. జీవితాన్ని ఆస్వాదించడం మరిచిపోతున్నాము. జీవితం చాల చిన్నది అని గుర్తుంచుకొని ప్రతి రోజు ని ఆనందంగా గడపాలి. 


బాల్యం లో చదువుతోనే కాలం గడిచిపోతుంది, యవ్వనం లో సంపాదన తోనే సమయం గడిచిపోతుంది, తర్వాత పిల్లల పెంపకం, ఆ తర్వాత వ్రుధాప్యం లో చావు కోసం ఎదురుచూడడం, ఇంక జీవితం లో ఆనందం ఎక్కడుంది ? ఇది మనం సాధారణంగా చెప్పుకొనే సమాధానం, కాని రోజు మనం చేసే పనులలోనే ఆనందం వెతుకోవాలి, వీలైనప్పుడల్లా ప్రకృతిని ఆస్వాదించాలి. అవకాసం వస్తే మనకు చేతనైతే ఇతరులకు సహాయం చెయ్యాలి. కొత్తవి ఎదన్న ప్రయత్నించాలి, వేరే ప్రదేశాలని చూడాలి. మన అమ్మమ్మలతో, నానమ్మలతో కాసింత సమయం కేటాయించాలి.  ఇలా ప్రతి అవకాసం లో ఆనందాలని వెతుకుంటే, జీవితాంతం లో జీవితం అంతం రెండు బాగుంటాయి. 


13, అక్టోబర్ 2012, శనివారం

మా ఇంటి మిథునం



 శ్రీ రమణ గారు రాసిన మిథునం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈ కథ కి చాల మందే అభిమానులు ఉన్నారు, ఎన్నో భాషల్లోకి అనువందిన్చబడింది, ఎన్నో ప్రశంసలు పొంది తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలో సినిమా లాగ కూడా రాబోతుంది. దీనికి లింక్ ఇక్కడ



ఈ కథ నాకు నచ్చడానికి ముఖ్య  కారణం అందులో పెరటిని వర్ణించిన తీరు. ఇంట్లో మొక్కలు పెంచితే ఇంటికి ఒక కొత్త కళ వస్తుందని నా ప్రగాడ నమ్మకం, నేను ఇప్పుడు ఉంటున్న చిన్న గది లో కూడా నాలుగు మొక్కలు పెంచుకుంటూ నేను సైతం ప్రపంచానికి ప్రాణవాయువు ఇచ్చి పోసాను అని పాట పాడేసుకుంటున్నాను. విషయానికి వస్తే ఈ కథ అప్పలదాసు, బుచ్చిలక్ష్మి అనే వృద్ద దంపతుల గురించి, ఇద్దరు తొంబై మీద పడ్డవాళ్ళే.  వారి మధ్య జరిగే సంభాషణలు, చమత్కారాలు , కారాలు మిరియాలు, వారి మధ్య ప్రేమానురాగాలు, అబ్బా ఎంత చెప్పిన తక్కువే, దంపతులంటే ఇలా ఉండాలి అనే లా ఉంటారు. ఐతే ముక్యంగా వాళ్ళ పెరడు గురించి చెప్పుకోవాలి, అందులో అందంగా పెంచుకున్న అరటి చెట్లు, అల్లం మోసులు, కంద పిలకలు, కంచేవారగా కాకర బీర దొండ తీగలు, కూర మడులు, బాదం, దబ్బ నిమ్మ, ఉసిరి, కొబ్బరికాయ చెట్లు, మందారాలు, మంకెనలు, కనకాంబరాలు, తీగ మల్లెలు ఇలా ఎన్నో ఎన్నెన్నో....ఒక చిన్నఅందమైన పొదరిల్లు  


అంత వయసు మీద పడ్డా సొంత బిడ్డల్లాగా చూసుకొనే పెరటిని నా ఊహల్లో అంతకంటే అందంగా చిత్రిన్చేసుకున్నాను. దీనికి కారణం అచ్చం అలాగే మా ఊరిలో మా నానమ్మ, అమ్మ కలిసి పెంచిన అందమైన పెరడు. కాయగూరల మొక్కలు, పళ్ళ చెట్లు, పూల మొక్కలు , కొన్ని ఔషధ మొక్కలు, ఇంకోన్ని పిచ్చి మొక్కలు అన్ని కలిపి మా ఇల్లు పచ్చని పరికిణి కట్టుకున్న అందమైన అమ్మాయి లాగ ఉంటుంది. ఈ తోట ని ఇన్ని రకాల మొక్కలతో నింపిన మా నానమ్మ ఓర్పు ని మెచ్చుకోక మానలేము. ఎ ఊరికి వెళ్ళిన వెంట  ఒక మొక్క కచితంగా తెస్తుంది, అలా ఎన్నో రకాల చెట్లతో మా ఇల్లు కళకళలాడుతుంటుంది . ఇంక సంత కెళ్ళి కూరగాయలు కొననవసరం లేదు, దాదాపుగా ఇంట్లో రోజు వండే కూరగాయలన్ని తాజాగా చెట్టు మీద నుండి పొయ్యి లోకి పడతాయి. వీటి రుచి గురించి మళ్ళి ప్రత్యేకంగా చెప్పాలా. ఈ కూరలకి డబ్బు వాసన ఉండదు, దళారుల చేతు కంపు ఉండదు అందుకే వీటిని వండేటప్పుడు వచ్చే గుమగుమలు మహాద్బుతం. బృ కాఫీ ad లో అన్నట్టు రంగు, రుచి, చిక్కదనం అన్ని ఉంటాయి. నా చిన్నప్పుడు నీళ్ళు తాగడానికి వంటిట్లోకి వస్తే, మా అమ్మ కరివేపాకు రెమ్మ ఒకటి విరిచుకొని తీసుకురామ్మ అనేది. ఒక రెమ్మ అలా లాగేసి పోపు లోకి పడేస్తుంటే ఆ వాసనని ముక్కుపుటాల్లోకి  నిండుగా నింపుకొంటె  ఆహా, అలాంటి వసాన మళ్ళి ఇంక ఎక్కడ నాకు తగలలేదు.

ఇంట్లోకి ఏ కూర వండాలా అన్నది ప్రతి రోజు ప్రతి ఆడపడుచు ఎదురుకొనే ప్రశ్నే, కాని మా ఇంట్లో అలా కాదు, ఎ చెట్టు కైతే ఇంటికి సరిపడా కాయలు కాస్తాయో అది వండడమే. వంకాయలు, బెండకాయల చెట్లు, కాకరకాయ, దొండకాయల తీగలు, బచ్చల కూర,  మిరపకాయ తోటల్లో కాసే పాలాకూర ఇలా ఎన్ని రకాలో....మిరపకాయ తోటల్లో అక్కడక్కడ టమాట విత్తనాలు , దోసకాయ విత్తనాలు వేస్తారు మా తాతయ్య , ఇంక వీటికి డోకా ఎలాగో లేదు. అదే తోటలో ఒక చివరగా కాసిన్ని ఉల్లిగడ్డలు నాటితే, సంవత్సరానికి సరిపడా ఉల్లిగడ్డలు బస్తాల్ల్లో నింపుకోవచ్చు. వరి ఎలాగో  ముఖ్యమైన పంట కాబట్టి, బియ్యం మా నాన్న పండించిందే. ఇప్పుడు నేను ఉంటున్న దేశం లో బియ్యం తింటుంటే తెలుస్తుంది, మా ఊరి బియ్యం విలువ.  అలా పళ్ళెం లో ఉన్న పదార్థాలన్నీ పెంచిన  చేతులే తింటుంటే, పుట్టిన చోటే గిట్టడ్డం, సొంత ఊరిలోనే సమాధి అయిపోయిన ఆనందం ఆ మొక్కలకి కూడా ఉంటుందేమో.

పూల మొక్కల గురించి చెప్పకపోతే అలుగుతాయి , మా పడక గది కిటికిని ఆనుకొని పాకిన మల్లె చెట్టు కి కోసుకున్నవాడికి కోసుకున్నంత పూలు, మా మల్లె చెట్టు ని అలా  వంటరిగా వదిలేయకుండా వాటి నేస్తాలు కనకాంబరాలు, ధవనం చెట్లు దాని నీడలో హాయిగ పెరుగుతాయి. వీటి మూడిటిని కలిపి అల్లి  జడ లో  పెట్టుకుంటే కిలోమీటర్ దూరం వరకు సువాసన  గుప్పుమంటుంది. చేమంతులైతే  తోట్లల్లో పెరుగుతూ నిండుగా తొట్టి అంత ఒక పెద్ద పువ్వేమో అనిపిస్తుంది. ఈ మధ్య వాసన లేని ఆర్నమెంటల్ మొక్కలు కూడా వచ్చేసాయి. చూడడానికి అందంగా ఉన్నా, ఎక్కువ మందిని ఆకర్చించిన మా మల్లె చెట్టే మాకు మహారాణి. పల్లెటూరి ఆడపడుచు, సిటీ పాపలకు తేడా లాగ అన్నమాట.

 ఈ చిన్ని చిన్ని మొక్కల మధ్య మహారాజులలా ఇంటి ఆవరాణలో నాలుగు కొబ్బరి  చెట్లు, ఒక జామచేట్టు, ఈ మధ్యేచనిపోయిన దాన్నిమ్మ చెట్టు ఉన్నాయి. వీటి నీడలో మంచం వేసుకొని పడుకుంటే దొరికే సుఖం  ఇంక నేను మాటల్లో చెప్పలేను.

ఒక్కసారి ఈ దేశాన్ని విడిచి అలా మా ఊరికి వేల్లిపోవాలనుంది. చిన్నపుడు చెట్లకి నీళ్ళు పోయ్యమంటే, నానా సాకులు చెప్పి తప్పించుకున్నాను మళ్లి  వెనక్కి వెళ్లి ప్రతి మొక్కని తడిమి తడిమి నీళ్ళు పోయ్యాలని  ఉంది.

27, సెప్టెంబర్ 2012, గురువారం

ఆవేదన, ఆక్రందన, ఆలాపనా, నా ప్రార్ధన



అడుగు ఐతె  వేసాను కాని దారి ఎటువైపు, బ్లాగ్ మొదలుపెట్టాను కాని మొదటి టపా ఎం వ్రాయాలి అని ఆలోచిస్తూ ఈరోజు నేను పని చేసే హాస్పిటల్ లోకి వస్తున్నాను,  (నేను చిన్న పిల్లలకు రక్తంలో వచ్చె కాన్సెర్ మీద పరిశోధన చేస్తాను), అక్కడ తోపుడు కుర్చీ లో ఒక ఎనిమిది-తొమ్మిది సంవత్సరాల అబ్బాయి కనిపించాడు. కాన్సెర్ భారిన పడడం వల్ల జుట్టు అంతా రాలిపోయింది. పక్కనే వాళ్ళ నాన్న తో ఏదో మాట్లాడుతున్నాడు. చేతులకి ఏవో పైపులు, సూదులు తగిలించారు. ఇలాంటి పిల్లలని రోజు చూస్తున్నా, ఈరోజు ఎందుకో ఒకలాంటి బాధ మనస్సు ని ఆవహించింది . అప్పుడే దీని గురించి ఒక టపా రాయాలని నిర్ణయించుకున్నాను.

చిన్నపుడు ఎప్పుడో గీతాంజలి సినిమాలో నాగార్జున కి acute myeloid leukemia అని అరుణ చెప్పినప్పుడు ఆహా ఎంత బాగుంది ఆ జబ్బు పేరు, ఆ జబ్బు నాకు వస్తే బాగుండు చక్కగా నాగార్జునలా శాలువ కప్పుకొని ఊటీ కి వెళ్లి  ఆమని పాడవే హాయిగా అని పాట పాడుకోవచనుకోనేదాన్ని. ఇప్పుడు ఈ ఆలోచనకి నవ్వొస్తుంది. అయినా  బాల్యం లో వెల్లకాయంత వెర్రి ఉంటేనే కౌమారం, యవ్వనం, వృధ్యాప్యం మధురంగా ఉంటాయి కదా.

మన తెలుగు సినిమాలలో పాతిక లేదా పది శాతం సినిమాలు కథానాయకుడు లేదా కథానాయిక cancer భారిన  పడి చనిపోవడం మీదే కథను అల్లడం మనకు సుపరిచితమే, కాని ఇది నిజ జీవితం లో ఎంత కల్లోలం సృష్టిస్తుందో స్వయంగా చూసినవాళ్ళకే తెలుస్తుంది. మా వైద్యశాలలో ప్రతి రెండు వారాలకి ఒక చావు కబురు, నిన్న చూసిన పిల్లలు ఈరోజు లేరు, ఈరోజు చూస్తున్వా వాళ్ళ మొహాల్లో చావు ని వెతుకోనవరసం లేదు, స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా అందరు ఐదు నుండి పదహారు సంవత్సరాల లోపు పిల్లలే. జీవితం లో ఇంకా ఏది చూడకుండానే, జీవితం అంటే ఏంటో తెలియకుండానే రాలిపోతున్న ఈ మొగ్గలని చూస్తుంటే కలిగే ఆవేదన వర్ణనాతీతం.

ఇంత మంది పిల్లలు పెద్దలు ఈ కాన్సెర్ భారిన పడుతుంటే డాక్టర్స్ ఎం చేస్తున్నారు ? వైద్యం, పరిశోధన ఎం చేస్తున్నాయి? అన్న ప్రశ్న సహజంగా మన అందరి మదిలో మెదులుతుంది. కాని నిజానికి కాన్సెర్ వ్యాధి మీద ఎంతో పరిశోధన జరుగుతుంది, కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు, యూరోలు, డాలర్లు కాన్సెర్ పరిశోధన కోసం కేటాయింపబడుతున్నాయి. నాకు తెలిసిన కొన్ని మంచి కాన్సెర్ వైద్యశాలలలో పోస్తున్న డబ్బు తో ఆఫ్రికా ఖండం లో ని కొన్ని దేశాలు ఒక సంవత్సరం పాటు తిండి తినోచ్చు అని ఇక్కడ అనుకుంటూ ఉంటారు.

మరి ఫలితాల సంగతి ఏంటి? అక్కడికే వస్తున్నాను. కాన్సెర్ అనే జబ్బు కేవలం ఒక కారణం వళ్ళ రాదు, కారణాల బట్టి కాన్సెర్ లో ఎన్నో రకాలు ఉంటాయి. ఒక్కో క్క శరీర భాగాన్ని బట్టి ఒక్కొక్క రకం ఉంటాయి. మన జన్యువుల్లో సహజంగా కాన్సెర్ ని నిరోధించే genes ఉంటాయి వాటినే tumour suppresive genes అంటారు. చాల రకాల కాన్సెర్ లు ఈ జన్యువుల్లో లోపాల వల్లే వస్తాయి. ఇంటిని శుభ్రం చేసే సాధనమే చెడి పోతే ఇల్లు కి జబ్బు చేయడం అన్నమాట. ఎన్నో జన్యువులు, కొన్ని దురలవాట్లు, తల్లితండ్రుల నుండి సంక్రమించే లోపాలు, ఆహారపుటలవాట్లు, క్రిములు ఇలా ఎన్నో కారణాల వళ్ళ సోకుతుంది  కాబట్టి కచ్చితంగా ఈ మందు వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పలేము. మనిషి మనిషి ని బట్టి మారుతుంది అందుకే  personalized మెడిసిన్ (మనిషిని బట్టి మందు)  అనేది త్వరలో రాబోతుంది. ఇప్పటికే చాల మందులు ఎలుకల మీద ప్రయోగిస్తున్నారు, human trails అంటే మనుషుల మీద ప్రయాగాలు చేసి త్వరలో ఈ చిన్నారులను చేరుకోవాలని నా ఆలాపన. ప్రయోగాల నిమిత్తం వారి శరీరాలను అర్పించి చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని నా ప్రార్ధన.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మొదటి అడుగు

నేను తన గర్భం లో ఉన్నప్పుడే అనుకుందేమో మా అమ్మ నా పేరు లో ఉన్న స్మృతి లాగే నా జీవితం నాకు చాల స్మృతులని మిగిలించాలని, అలా జీవితం మిగిలించిన గత స్మృతుల జ్ఞాపకాల బరువుని కాస్త మీతో పంచుకుందామనే తపనతోనే ఈ బ్లాగ్ ని మొదలుపెడుతున్నాను.  తెలుగు భాష మీద ఉన్న అభిమానమో, నా జీవితం మిగిలించిన తీపిచేదు గుర్తులో, స్వతహాగ అతిగా వాగే అలవాటు ఉండడం వల్లో, నేను రాయగలనా అన్న సందేహపు తెరని చీల్చడానికో తెలిదు కాని వ్రాస్తున్నాను. వ్రాయడం మొదలుపెడుతున్నాను.

మాట మంత్రమైతే మౌనం అమృతం అని ఎక్కడో చదివాను, అతిగా వాగుతున్న నాకు ఈ వాక్యం మౌనాన్ని పరిచయం చేసింది తర్వాత జీవితం నన్ను సప్తసముద్రాలవతలికి లాగేసి మాతృ భాష కనుచూపు మెరలో వినపడని చోటులో పడేసి తిక్క కుదిరిందా అని నవ్వి వెళ్లిపోయింది. అప్పటి నుండి కొత్తగా పరిచయమైనా మౌనపు సంగర్షణ నుండి బయటపడాలన్న దిశగా వేసిన మొదటి అడుగే నా ఈ బ్లాగ్.

భాష మీద పట్టు లేదు చెప్పాలన్న తపన తప్ప
వ్యాకరణం అంటే తెలిదు వ్యక్తపరచాలన్న ఆశ తప్ప

ఒక చిన్న కవిత ప్రయత్నించాను :-)

నేను వేస్తున్న ఈ మొదటి తప్పటడుగు ఎన్ని నడకలు నేర్పుతుందో, ఏ తీరాలకు చేరుస్తుందో, ఎంత మంది బాటసారులను పరిచయం చేస్తుందో చూడాలి. కొన్ని సార్లు గమ్యం చేరామన్న ఆనందం కంటే నడచిన తోవ బాగుంటుంది. ఈ ప్రయాణం ఎలా ఉండబోతుందో.